Reading Time: < 1 minute
India Vs Zimbabwe Playing Xi Updates Sanju Samson Axar Patel Likely In Do Or Die Clash

India Playing XI Updates vs Zimbabwe: టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో కీలక పోరుకు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తిరిగి జట్టులో స్థానం దక్కే అవకాశాలు దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జింబాబ్వేపై సంజూ మూడో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. మెగా టోర్నీలో తిలక్ వరుసగా విఫలమవడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో తిలక్ వర్మ తన అత్యుత్తమ ప్రదర్శనను చేయలేదు. నెదర్లాండ్స్‌పై 27 బంతుల్లో 31 పరుగులే అతడి అత్యధిక స్కోరు. అమెరికాపై 25, నమీబియాపై 25, పాకిస్తాన్‌పై 25 రన్స్ చేశాడు. మంచి ప్రారంభాలను బిగ్ ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. ఇక దక్షిణాఫ్రికాపై 1 రన్ చేసి పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లలో 21.40 సగటుతో 107 పరుగులు చేశాడు. తిలక్ స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంది. దాంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ స్థానంపై కూడా సందేహలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ సుందర్ స్థానంలో ఆడుతాడని తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి మద్దతుగా నిలుస్తున్నాడు. జింబాబ్వేపై మరో అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు సమాచారం. సంజూ శాంసన్‌, అక్షర్ పటేల్ జింబాబ్వేపై ఆడడం దాదాపుగా లాంఛనమే.

Also Read: Suryakumar Yadav Stats: నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యకుమార్.. ఈ గణాంకాలు చూస్తే షాకే!

జింబాబ్వేతో మ్యాచ్ చెన్నై వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ పోరు టీమిండియాకు డూ ఆర్ డైగా మారింది. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం గెలిస్తే సరిపోదు.. 150 పరుగుల తేడాతో గెలవాలి. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్ సరైన కాంబినేషన్ కోసం చూస్తోంది. మరి కెప్టెన్ సూర్య ఎవరికి అవకాశం ఇస్తాడో. ఎవరు తుది జట్టులో ఉంటారో తెలియాలంటే టాస్ వరకు వేచి చూడాల్సిందే.