Reading Time: < 1 minute
Swastha Nari Mission Free Hpv Vaccination Drive India 2026

HPV vaccination: కేంద్ర ప్రభుత్వం నారీ సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ‘‘స్వస్థ నారీ మిషన్’’ కార్యక్రమం కింద 14 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలికల కోసం HPV (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. గర్భాశయ క్యాన్సర్లు (Cervical Cancer)పై కేంద్రం యుద్ధం ప్రకటిస్తూ.. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనుంది.14 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసు కలిగిన బాలికలందరికీ ఈ టీకా ఇవ్వనున్నారు.

ఉచితంగానే ఈ వ్యాక్సిన్‌ను కేంద్రం అందించనుంది. ప్రైవేట్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ‘‘గార్డసిల్’’ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, క్యాన్సర్‌కు ప్రధాన కారణమయ్యే HPV టైప్స్ 16, 18 తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లను కలిగించే టైప్స్ 6, 11 నుండి రక్షణ ఇస్తుంది. 14 ఏళ్ల లోపు బాలికలకు ఇచ్చే సింగిల్ డోస్ కూడా భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా అద్భుత రక్షణ ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Read Also: Keralam: కేరళ ఇకపై ‘కేరళం’.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్!

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా శిక్షిణ పొందిన మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఉంటుంది. టీకా వేసిన తర్వాత తలెత్తే అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ‌ను నిర్వహించడానికి ప్రత్యేక వ్యవస్థల్ని సిద్ధం చేశారు.

ఇది కేవలం వ్యాక్సినేషన్ డ్రైవ్ మాత్రమే కాకుండా, భారత దేశ చరిత్రలో మహిళలకు, పిల్లల కోసం చేపట్టిన అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. కేంద్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖలు కలిసి దీనిని నిర్వహించబోతున్నాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతీ బాలికకు ఈ వ్యాక్సిన్ అందేలా కేంద్ర చర్యలు తీసుకోనుంది.