
గాంధీ ఆసుపత్రి వైద్యుడి ద్వారా పోస్టుమార్టం రిపోర్టు ఇప్పించేందుకు బాధితుడి నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ కీసర పోలీస్ స్టేషన్ హోంగార్డ్ ఏసీబీకి చిక్కాడు. హోంగార్డ్ నగేష్‌తో పాటు గాంధీ ఆసుపత్రి వైద్యుడు సందీప్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఏసీబీ డిఎస్‌పి జి.శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం అక్టోబర్ 12న భువనగిరికి చెందిన తోటకూర మహేష్ యాదవ్ ఛాతీలో నొప్పితో అస్వస్తతకు గురై కీసర నితిన్ హాస్పిటల్‌లో మృతి చెందాడు. అతని మృతికి వైద్యుడి నిర్లక్షమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కోసం మృతుని మేనలుకలడు శరత్ కీసర పోలీస్ స్టేషన్ ద్వారా పోస్టుమార్టం వ్యవహారాలు చూసే హోంగార్డ్ నగేష్‌ను సంప్రదించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు సందీప్ రిపోర్టు ఇచ్చేందుకు హోంగార్డ్ ద్వారా రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు.
రిపోర్టు ఇచ్చేందుకు బాధితుడిని గత నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో బాధితుడు చివరకు రూ.40 వేలు లంచంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఈ విషయంపై ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం హోంగార్డు నగేష్‌కు బాధితుడు మొదటి విడతగా రూ.5 వేలు వైద్యుడికి అందజేశాడు. శనివారం మధ్యాహ్నం చీర్యాల చౌరస్తా సమీపంలోని గ్రీన్ లీప్ దాబా వద్ద బాదితుడి నుంచి హోంగార్డు మిగతా రూ.35 వేలు తీసుకోగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో గాంధీ హాస్పిటల్ వైద్యుడు సందీప్‌ను శంషాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హోంగార్డు నగేష్, వైద్యుడు సందీప్‌ను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.