Reading Time: 3 minutes

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రోడ్లపై నిర్దిష్ట 14 కి.మీ దూరంలోని ఆసుపత్రికి 22 నిమిషాల్లో చేరుకుని ఐదుగురు రోగుల ప్రాణాలను కాపాడిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి అవయవాలను దానం చేస్తుడడం నిత్యం చదువుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ‘అవయవ దానం’కు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషికి, మరణించిన మనిషి ప్రాణంపోయడం మానవత్వానికి ఉన్న గొప్ప గుణంగా భావించాలి. మరణించిన మనిషి తాలూకూ అవయవాలను నిర్దిష్ట సమయంలో మరో మనిషికి అమర్చడంవల్ల ఓ కొత్త జీవితం అందుతుంది. మరణం అంచున ఉండేవారికి రెండవ జీవితాన్ని ప్రసాదించడం ‘పునర్జన్మ’గానే భావించాలి. ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా అవయవ దానంపై కొంతసానుకూల వాతావరణం ఏర్పడుతోంది.

2013లో అవయవదాతల సంఖ్య 5 వేల లోపు ఉండగా, 2025లో నాలుగు రెట్లు పెరిగి 20 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా పన్నెండు వందల కుటుంబాలు అవయవాలు దానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు. అత్యధిక అవయవదానం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ కావడం విశేషం. మధుమేహం, అధిక రక్తపోటు తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కిడ్నీ, కాలేయం, గుండె తదితర వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. సరిపడ అవయవాల లభ్యత లేనందువల్ల ఏటా అయిదు లక్షలమంది నిస్సహాయస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి జీవించినప్పుడు రక్తదానంతో పాటు కిడ్నీ, కాలేయం, గర్భాశయం, గర్భధారణ కణజాలం దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్ అయితే మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, గుండె కవాటాలు, పేగులు, క్లోమం, కార్నియా ఇతరులకు ఉపయోగపడుతాయి. గుండె ఆగి మరణించిన వారైతే కళ్లు, చర్మం, గుండె, కవాటాలు, ఎముకలు వంటి కణజాలాలు వంటి అవయవాలు మాత్రమే కాకుండా, మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు.

బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను నిర్దేశిత సమయాల్లో అవసరమైన వారికి అమర్చాలి. ఆలస్యమైతే అవి పాడైపోయే ప్రమాదముంది. ఒక దాత ఎనిమిదిమంది ప్రాణాలను కాపాడటానికి ఆస్కారముంది. అలాగే సహజ మరణం చెందిన కొద్ది నిమిషాల్లో కళ్లు. కణజాలం (టిష్యూ) సేకరించవచ్చు. కానీ, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపోహల వల్ల అవయవదానం చేస్తున్నవారి సంఖ్య ఆశించినమేరకు పెరగడం లేదు. 2023లో పదివేల మంది మహిళలు జీవించి ఉండగానే అవయవదానం పత్రాలమీద సంతకం చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక తెలిపింది. పురుషులతో పోల్చితే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు. దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఒకటిన్నర లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. సంబంధిత కుటుంబాలకు నచ్చజెప్పి మృతుల్లో కొందరి అవయవాలను మార్పిడి చేసినా అభాగ్యులెందరికో కొత్త ఊపిరి అందుతుంది. కానీ, బ్రెయిన్‌డెడ్ కేసులను సత్వరం గుర్తించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను ఒప్పించడంలో నిర్లక్ష్యం నెలకొంటోంది.

అవయవ దానం చేసేందుకు ఎవరైనా ముందుకు రావచ్చు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి అవయవదానం కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లలోపు ఉండేవారు తమ అవయవాలను దానం చేయడానికి అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి ఉండాలి. మరణానంతరం అవయవ దానం కోసం నమోదు చేసుకుంటే, ముందుగా ఆ వ్యక్తిని వైద్యులు తనిఖీ చేస్తారు. ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్య సమస్యలను అంచనా వేసి ఏ అవయవాలను దానం చేయవచ్చో తెలియజేస్తారు. తీవ్ర ప్రమాదం లేదా ఏదైనా వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లి, మళ్లీ స్పృహలోకి రాలేని పరిస్థితిలో ఉన్న బాధితుడిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారిస్తారు. ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో వారి గుండె ఇంకా కొట్టుకుంటూ, ఇతర ముఖ్య అవయవాలు మాత్రం కొన్ని గంటలపాటు పనిచేస్తూనే ఉంటాయి. వీటిని కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించి, బ్లడ్‌గ్రూప్ తదితర అంశాలు సరిపోలిన వారికి నిర్దేశిత సమయంలో అమర్చుతారు.

బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీకరించడానికి ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యనిపుణులతో కూడిన బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అవయవాల సేకరణ, నిల్వ, తరలింపు, వాణిజ్యపరంగా వాటి దుర్వినియోగం వంటివాటిని నియంత్రించడానికి 1994లో మానవ అవయవాలు, కణాల మార్పిడి చట్టం తీసుకువచ్చింది. 2011లో దీనికి సవరణలు చేశారు. అవయవాల సేకరణ, కేటాయింపు, తరలింపును జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఒటిటిఒ) పర్యవేక్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానానికి ‘జీవన్‌దాన్’ ఎంతగానో కృషి చేస్తొంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలూ పాటుపడుతున్నాయి. మరణించిన వ్యక్తుల అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు 2019లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈమేరకు అవయవాల అందుబాటును పెంచాలనేది జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమ ఉద్దేశం. జాతీయ, ప్రాంతీయ, రాష్ర్ట స్థాయి అవయవ, కణజాల మార్పిడి సంస్థలు అవయవాల సేకరణ, పంపిణీకి సంబంధించిన సమన్వయ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాయి.

అవయవాలను అత్యంత తక్కువ సమయంలో సురక్షితంగా అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈమేరకు ప్రజలు వెబ్‌సైట్ ద్వారా అవయవ దానానికి ‘ఎన్‌ఒటిటిఒ’ను తీసుకొచ్చింది. దాత నుంచి సేకరించే అవయవాలను గ్రహీత ఉండే ఆస్పత్రికి చేర్చే ప్రక్రియలో అంబులెన్సులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రీన్‌కారిడార్ పేరిట ప్రత్యేక మార్గాన్ని కల్పించారు. అంతేకాకుండా ‘ఒకే దేశం ఒకే విధానం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీంతో భారతీయులంతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 65 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని తొలగించడం వల్ల ఎవరైనా, ఎక్కడైనా గ్రహీతలుగా అర్హులే. ఈ నేపథ్యంలో అవయవ దానంపైన ప్రచారోద్యమం ముమ్మరంగా సాగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విదార్థులకు అవయవదానంపై అవగాహన కల్పించాలి. ఎవరికైనా అపోహలుంటే తొలగించాలి. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా వేదికల ద్వారా ప్రచారం పెంచాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలి.

– కోడం పవన్‌కుమార్

– 9848992825