Reading Time: < 1 minute

 ప్రతిష్ఠాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో జమ్ముకశ్మీర్ టీమ్ నయా చరిత్ర సృష్టించింది. 202526 రంజీ సీజన్‌లో జమ్ముకశ్మీర్ జట్టు విజేతగా నిలిచింది. ఈ క్రమంలో తొలి సారి రంజీ ట్రోఫీని గెలిచి నయా రికార్డును తన పేరిట లిఖించుకుంది. కర్ణాటకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్ముకశ్మీర్ రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా రంజీ బరిలో దిగిన కశ్మీర్ టీమ్ ఏకంగా ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది. శనివారం చివరి రోజు జమ్ము రెండో ఇన్నింగ్స్‌ను 324/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఖమ్రాన్ ఇక్బాల్ 160 (నాటౌట్), సాహిల్ లోత్రా 101 (నాటౌట్) అజేయ శతకాలతో అలరించారు.

కాగా, మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్‌లు డ్రాకు అంగీకరించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్మును రంజీ ట్రోఫీ విజేతగా ప్రకటించారు. కాగా, జమ్ము తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేయగా, కర్ణాటక 293 పరుగులకే కుప్పకూలింది. ఇదిలావుంటే ఫైనల్ మ్యాచ్ చివరి రోజు ఆటను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో కలిసి విజయోత్సవ వేడుకలో పాల్గొన్నారు. అంతేగాక రంజీ ట్రోఫీతో నయా చరిత్రను సృష్టించిన జట్టుకు రూ. 2 కోట్ల నజరానాను ప్రకటించారు.

ప్రధాని మోడీ అభినందనలు..

ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీని సాధించిన జమ్ముకశ్మీర్ జట్టును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఇది చారిత్రక విజయమని, దీన్ని సాధించిన జమ్ము జట్టు ప్రతిభను కొనియాడారు. కొన్నేళ్ల క్రితం వరకు అల్లకల్లోల వాతావరణంతో సతమతమయిన జమ్ముకశ్మీర్ ప్రజలకు క్రికెట్ టీమ్ సరికొత్త ఊరట కలిగించిందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది దోహదం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.