Reading Time: < 1 minute

చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టి20 ప్రపంచకప్ సూపర్8 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు చేరుకోలేక పోయింది. మెరుగైన రన్‌రేట్ కలిగిన న్యూజిలాండ్ జట్టు గ్రూప్2 నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇంతకుముందే సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్,

ఫకర్ జమాన్‌లు అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. చెలరేగి ఆడిన ఫర్హాన్ 60 బంతుల్లోనే 9 ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఫకర్ 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్‌శనక 31 బంతుల్లోనే 8 సిక్స్‌లు, రెండు ఫోర్లతో అజేయంగా 76 పరుగులు చేసి లంకను ఆదుకున్నాడు.