Reading Time: < 1 minute
VC Sajjanar: రిటైర్ అవుతున్న పోలీస్ సిబ్బందికి వీసీ సజ్జనార్ స్వీట్ అడ్వైస్.. ఏం చెప్పారంటే?

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం సేవలందించి, పదవీ విరమణ పొందుతున్న 19 మంది పోలీసు అధికారులకు నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ పొందుతున్న వారిలో నలుగురు ఎస్.ఐ.లు, పది మంది ఏ.ఎస్.ఐ.లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు ఎల్.జి.ఇ ఉన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందుతున్న అధికారులందరికీ తన తరపున, హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం తరపున శుభాకాంక్షలు తెలిపారు. పూర్వం ఫుట్ పెట్రోలింగ్ నుండి ప్రస్తుత ఇన్నోవా పెట్రోలింగ్ వరకు, మారుతున్న కాలానికి అనుగుణంగా వారు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సుమారు 41 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసిన మీలాంటి అనుభవజ్ఞులైన అధికారులు వెళ్తుండటం పోలీసు శాఖకు లోటు అని, అయితే ఇది సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.

పోలీసులకు సీపీ సూచనలు

ఆరోగ్యం అండ్ జీవనశైలి: పదవీ విరమణ అనేది ఒక కొత్త ఆరంభమని, శేష జీవితాన్ని కుటుంబంతో కలిసి ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపాలని సీపీ సజ్జనార్ అన్నారు. నిత్యం ఏదో ఒక వ్యాపకంతో చురుగ్గా ఉండాలని సూచించారు.

ఆర్థిక జాగ్రత్తలు: రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో వచ్చే నగదును ప్రభుత్వ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. అధిక లాభాల ఆశ చూపే మోసగాళ్ల పట్ల, ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కుటుంబ సభ్యులకు: పదవీ విరమణ పొందిన వారిని గౌరవప్రదంగా చూసుకోవాలని, వారి మానసిక ప్రశాంతతకు కుటుంబ సభ్యులు సహకరించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.