
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నగరం, ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రం దుబాయ్‌పై ఇరాన్ శనివారం రాత్రి బాంబుల దాడికి దిగింది. తమ శక్తివంతమైన షహీన్ డ్రోన్‌తో దుబాయ్ నడిబొడ్డున బాంబులు కురిపించింది. ఈ దశలో పలు బహుళ అంతస్తుల భవనాలకు ముప్పు తలెత్తింది. పామ్ జుమేరియా ప్రాంతంలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌పై బాంబులు వచ్చి పడ్డాయి. దీనితో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. అయితే ఈ ప్రాంతంలోకి వెంటనే అత్యధిక సంఖ్యలో అంబులెన్స్‌లు తరలివచ్చాయి. నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వీరికి వెంటనే చికిత్స అందిస్తున్నామని స్థానిక వైద్య అధికారి తెలిపారు. సహాయక బృందాలను రంగంలోకి దింపారు. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ఇరాన్ తన ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఓ వైపు అబూధాబి, దోహా, రియాద్‌లపై ఇరాన్ దాడులు చేపట్టింది. అక్కడి అమెరికా సైనిక స్థావరాలను లక్షంగా ఎంచుకుంది.ఈ దాడులను ఆయా దేశాలు తీవ్రంగా పరిగణించాయి.
ఇది యుద్ధ తీవ్రతకు దారితీస్తుందని హెచ్చరించాయి. దుబాయ్‌లోఇరాన్ దాడుల్లో ఆసియా జాతీయుడు ఒకరు చనిపోయినట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే ఈ చనిపోయిన వ్యక్తిని పాకిస్థానీయుడిగా తరువాత గుర్తించారు. క్షిపణుల శకలాలు దుబాయ్‌లోని కొన్ని నివాసిత ప్రాంతాలపై పడ్డాయని వెల్లడించారు. ఆకాశంలో క్షిపణుల సంచారం చూశామని, భీకర రీతిలో పేలుళ్లు విన్పించాయని దుబాయ్ వాసులు తెలిపారు. ఓ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇళ్ల కిటికీ అద్దాలు పగిలాయి. ఇక ప్రఖ్యాత పర్యాటక స్థలం బూర్జు ఖలీఫా నుంచి సందర్శకులను వెలుపలికి పంపించారు. పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉండటంతో ఆయా ప్రాంతాలను ఎంచుకుని ఇరాన్ దాడులు సాగిస్తోంది. ఇరాన్ మిస్సైల్స్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ ప్రకటించింది