Reading Time: < 1 minute
India Clinches U 18 Hockey Asia Cup 2026 Title Defeats Japan 4 1 In Final

భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు జపాన్‌ను 4-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మ్యాచ్ రెండో నిమిషంలోనే ఆశిష్ తాని గోల్ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం 28వ, 34వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ నమోదు చేసి హ్యాట్రిక్ సాధించాడు. అతని అద్భుత ప్రదర్శనతో జపాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

ఇక భారత కెప్టెన్ కేతన్ కుష్వాహా 30వ నిమిషంలో మరో కీలక గోల్ సాధించి జట్టు విజయాన్ని మరింత పటిష్టం చేశాడు. జపాన్ జట్టు ఒక గోల్‌తో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకు భారత ఆటగాళ్లు సమన్వయంతో ఆడి 4-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు.

ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని హాకీ ఇండియా భారత ఆటగాళ్లకు భారీ నగదు బహుమతులను ప్రకటించింది. స్వర్ణ పతకం గెలుచుకున్న జట్టులోని ప్రతి క్రీడాకారుడికి రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపింది. అలాగే సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యునికి రూ.1.5 లక్షల చొప్పున బహుమతి ప్రకటించింది.

ప్రధాని మోడీ అభినందనలు

భారత్ విజయం సాధించడంతో ప్రధానమంత్రి Narendra Modi జట్టును అభినందించారు. “మన యువ హాకీ క్రీడాకారులు సాధించిన ఈ విజయం ఎంతో గర్వకారణం. టోర్నమెంట్ మొత్తం జట్టు అసాధారణ నైపుణ్యం, జట్టు స్ఫూర్తిని ప్రదర్శించింది. ఫైనల్‌లో సాధించిన ఈ విజయం చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఈ గెలుపు దేశంలో హాకీపై యువతలో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం” అని ప్రధాని పేర్కొన్నారు.

టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత యువ జట్టు ఆసియా ఖండంలో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయం భారత హాకీ భవిష్యత్తుకు మరింత ఉత్సాహాన్ని అందించనుంది.