Reading Time: < 1 minute

త్వరలోనే టిమ్స్ ఓపెన్..సీఎం రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి దామోదర వెల్లడి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని సనత్‌‌‌‌ నగర్ టిమ్స్ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణం పూర్తయ్యిందని..త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆయన ఆస్పత్రిలోని ఏ, బీ,సీ బ్లాకులను సందర్శించి ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, సీటీ స్కాన్, ఎంఆర్‌‌‌‌ఐ వంటి అత్యాధునిక విభాగాలను పరిశీలించారు. పెండింగ్‌‌‌‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యం, సెక్యూరిటీ వంటి వసతులు పక్కాగా ఉండాలని, రోగులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ ఏరియాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే సనత్‌‌‌‌ నగర్ టిమ్స్‌‌‌‌ ను గుండె చికిత్సలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందితో పాటు టెక్నీషియన్ల అందుబాటుపై సమీక్షించి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్. చొంగ్తు , డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు

©️ VIL Media Pvt Ltd.