Reading Time: < 1 minute
Robert Kiyosaki: టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు

“రిచ్ డాడ్, పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి భారీ స్టాక్ మార్కెట్ పతనం త్వరలో వస్తుందని హెచ్చరించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థను బుడగగా అభివర్ణించిన ఆయన, సిద్ధంగా ఉన్నవారికి ఇది సంపద సృష్టించే అవకాశమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి నిజమైన ఆస్తులపై దృష్టి సారించి, మాంద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కియోసాకి సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక నిపుణుడు, ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి భారీ స్టాక్ మార్కెట్ పతనం సమీపంలో ఉందని హెచ్చరించారు.

ఆయన ఇటీవల ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌లో గొప్ప సంక్షోభం ఇప్పుడు వస్తోందని, సిద్ధంగా ఉన్నవారికి ఇది అపారమైన సంపదను సృష్టించే అవకాశమని, సిద్ధపడని వారికి మాత్రం చెత్త పీడకలగా మారుతుందని పేర్కొన్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఫేక్ కరెన్సీ, అధిక అప్పులు, బలహీనమైన పెన్షన్ వ్యవస్థలపై ఆధారపడిన బుడగగా మారిందని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి నిజమైన ఆస్తులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తాను వ్యక్తిగతంగా ఈ ఆస్తులలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా బిట్‌కాయిన్‌లో కేవలం 21 మిలియన్ నాణేల పరిమితి ఉండటం వల్ల.. దానికి కొంచెం కొరత ఉందని.. మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా మనకు సాయం చేస్తుందని కియోసాకి విశ్వసిస్తున్నారు. మార్కెట్ కుప్పకూలడం ఒక చెడు సంఘటన కాదని, సరైన వ్యూహంతో వ్యవహరిస్తే అది గొప్ప అవకాశమని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యం అనివార్యమని, కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్నవారికి అది సంపద సృష్టించే అరుదైన అవకాశంగా మారుతుందని కియోసాకి స్పష్టం చేశారు.