Reading Time: < 1 minute
Sourav Ganguly Denies Mamata Banerjee Yusuf Pathan Resignation Claims

Sourav Ganguly: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మధ్య మరో వార్త జోరుగా హల్చల్ చేస్తోంది. బర్హంపూర్ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేసేలా ఒప్పించాలని సౌరవ్ గంగూలీని మమతా బెనర్జీ కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఉప ఎన్నికల ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మమతా బెనర్జీ ఇలా కోరిందనే ప్రచారం నడుస్తోంది. ఒక బెంగాలీ దినపత్రిక ప్రకారం.. యూసుఫ్ పఠాన్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేయవచ్చని టీఎంసీ భావిస్తోందని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజీనామా కోసం యూసుఫ్ పఠాన్‌ను ఒప్పించేలా సౌరవ్ గంగూలీని మమత సంప్రదించినట్లు వార్తా కథనం పేర్కొంది. అయితే, పఠాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పింది.

అయితే, ఈ వార్తపై గంగూలీ స్పందించారు. ‘‘నా గురించి ప్రచురించిన ఆరోపణలు అవాస్తవం. నిజాలు పట్టించుకోకుండా ఇలాంటి వార్తా కథనాలను ప్రచురించారు’’ అని అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ యూసఫ్ పఠాన్‌కు ఏ విషయం చెప్పమని తనను అడగలేదని, తాను యూసుఫ్ పఠాన్‌ను ఈ అంశంపై సంప్రదించలేదని స్పష్టం చేశారు.

టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో ఈ వార్త హల్చల్ చేసింది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీరు నచ్చక పార్టీలోనే తిరుగుబాటు వర్గం ఏకమైంది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 మంది రీటబ్రత బెనర్జీ వెనక ఉన్నారు. మమతా బెనర్జీ వర్గంలో కేవలం 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఎంపీల్లో కూడా చీలిక వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.