Reading Time: 2 minutes
Gautam Gambhir Backs Sai Sudharsan For No 3 Makes Key Remark On Rishabh Pant

Gautam Gambhir on Sai Sudharsan and Rishabh Pant: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు పలు కీలక అంశాలపై స్పందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో నంబర్-3 బ్యాటింగ్ స్థానం, వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాత్ర, అలాగే జట్టులో స్పిన్నర్ల ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది.

చేతేశ్వర్ పుజారా తర్వాత భారత టెస్టు జట్టులో నంబర్-3 స్థానానికి సరైన వారసుడు ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు అవకాశమివ్వాలని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘సాయి సుదర్శన్‌కు ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదు. అతను ఎక్కువగా ఇంగ్లండ్ పరిస్థితుల్లోనే ఆడాడు. అతనికి న్యాయం జరిగేలా తగిన అవకాశాలు ఇవ్వాలి. ఐపీఎల్‌లో 700 పరుగులు చేశాడు. కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాడిని అంచనా వేస్తే భవిష్యత్తుకు బలమైన జట్టును నిర్మించలేం’ అని గంభీర్ పేర్కొన్నాడు.

టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి రిషభ్ పంత్‌ను తొలగించడంపై కూడా గంభీర్ స్పందించాడు. పంత్ తన సహజ ఆటను మార్చాల్సిన అవసరం లేదని, కానీ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. ‘మేము రిషభ్ పంత్‌ను మార్చాలని అనుకోవడం లేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడడం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ప్రతి ఆటగాడి బాధ్యత’ అని గంభీర్ చెప్పాడు. యువ స్పిన్నర్లు మనవ్ సుతార్, హర్ష్ దూబేలకు తొలి టెస్టు పిలుపు రావడంపై మాట్లాడుతూ.. శ్రీలంక పర్యటనకు భారత జట్టు నాలుగు స్పిన్నర్లతో వెళ్లే అవకాశం ఉన్నందున, ఈ టెస్టు ద్వారా నాలుగో స్పిన్నర్‌ను ఎంపిక చేస్తామని తెలిపాడు. ‘మనవ్, హర్ష్ ఇద్దరూ ఎడమచేతి స్పిన్నర్లే అయినప్పటికీ వారి బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఈ మ్యాచ్ మాకు నాలుగో స్పిన్నర్‌ను గుర్తించే మంచి అవకాశం. శ్రీలంకలో నాలుగు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నాం’ అని వెల్లడించాడు.

భవిష్యత్ టెస్టు సిరీస్‌ల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గంభీర్ చెప్పాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ వంటి విదేశీ పర్యటనల కోసం జట్టును మెరుగ్గా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. కొంతమంది వన్డే రెగ్యులర్ ఆటగాళ్లను టెస్టు ప్రణాళికల్లో భాగంగా ఉపయోగిస్తామని, టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకంగా సన్నద్ధమవుతామని గౌతీ స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా నంబర్-3 స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కుతుందా?, నాలుగో స్పిన్నర్‌గా ఎవరు ఎంపిక అవుతారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.