Reading Time: < 1 minute
Tiger Creates Panic In Polavaram District Kills 14 Calves Forest Team Launches Rescue Operation

పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న పశువులపై రాత్రి వేళ ఒక్కసారిగా దాడి చేసిన పులి.. 14 దూడలను చంపినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం పశువుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన యజమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవడంతో పాటు తమ పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం పులిని బంధించేందుకు అడిషనల్ పీసీసీఎఫ్ నాగేశ్వరరావు, కాకినాడ డీఎఫ్‌వో రామచంద్రరావు ఆధ్వర్యంలో రాపిడ్ రెస్క్యూ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. పులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి జాడలను గుర్తిస్తూ దానిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపట్టారు.