Reading Time: 2 minutes
Bengaluru Police Issue Advisory Ahead Of Ipl 2026 Final Rcb Vs Gt

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌తో బెంగళూరు నగరం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT), రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి (మే 31, ఆదివారం) మహా సంగ్రామం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్ వచ్చింది. ఆర్సీబీ జట్టు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసిన నేపథ్యంలో.. మ్యాచ్ ముగిసిన తర్వాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు పోలీసులు అత్యంత కఠినమైన ట్రాఫిక్, భద్రతా మార్గదర్శకాలను (Advisory) జారీ చేశారు. మ్యాచ్ అనంతరం రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకోవడం, బాణాసంచా కాల్చడం, బైక్ ర్యాలీలు తీయడం, గొడవలకు దిగడం వంటి పనులకు దూరంగా ఉండాలని ప్రజలను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి బలమైన కారణమే ఉంది. గత ఏడాది (2025) జూన్ 4వ తేదీన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. ఆ సమయంలో అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి విషాదకర సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి పోలీసులు ముందస్తుగా ఈ ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి పబ్లిక్ సెలబ్రేషన్స్ లేదా బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ అడ్వైజరీ ప్రకారం.. బహిరంగ ప్రదేశాలలో పెద్ద ఎల్‌ఈడీ (LED) స్క్రీన్‌లపై మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. మాల్స్, పబ్‌లు లేదా ఇతర వ్యాపార సంస్థల వెలుపల సాధారణ ప్రజలకు కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు. ముఖ్యంగా రోడ్ల వైపు ముఖం ఉన్న ఎల్‌ఈడీ గోడలపై మ్యాచ్‌ను ప్రసారం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్లపై వేగంగా బైక్‌లు నడపడం, స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, బాణాసంచా కాల్చడం వంటి పనులను పూర్తిగా నిషేధించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో శాంతి, క్రమశిక్షణను పాటించాలని పోలీసులు కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం, వేడుకల నెపంతో హింసకు దిగడం వంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మ్యాచ్ ఫలితాన్ని బట్టి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, ద్వేషపూరిత సందేశాలు పంపడం, పుకార్లు వ్యాప్తి చేయడం వంటివి చేయవద్దని పోలీసులు సూచించారు. మ్యాచ్ గెలిచినా లేదా ఓడినా.. ప్రత్యర్థి జట్ల అభిమానులను కించపరచడం, గేలి చేయడం లేదా వారిని గొడవల్లోకి లాగడం వంటి పనులకు ఫ్యాన్స్ దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడటం అనేది అందరి సామూహిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని బెంగళూరు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.