Reading Time: < 1 minute

వరి కొయ్యలు కాల్చే రైతులపై సర్కార్ చర్యలు.. 8 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఫైన్

Caption of Image.

జగిత్యాల: వరి కొయ్యలను కాల్చే రైతులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పంట పొలాలలో వరి కొయ్యలు కాల్చిన 8 మంది రైతులకు 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. కథలాపూర్ మండలం రాజారామ్ తండాలో వరి కొయ్యలకు రైతులు నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ సమక్షంలో రైతులకు జరిమానా విధించారు.

గతంలో వరి కొయ్యలను కాల్చరాదని గ్రామ పంచాయతీలో గ్రామస్తులు తీర్మానం చేశారు. పంట అవశేషాలను కాల్చకుండా శాస్త్రీయ పద్దతిలో నిర్వహించి నేల సారాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో వరి కొయ్యలను కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని రైతులను హెచ్చరించారు.

వరి కొయ్యలు కాల్చడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో 27 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారికి పర్యావరణ పరిహారం పేరిట భారీ జరిమానాలు విధిస్తారు. బహిరంగంగా పంట వ్యర్థాలను తగలబెట్టే తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానాలు విధించి ఆయా గ్రామ పంచాయతీలు జరిమానాలు వసూలు చేస్తాయి. ఈ విషయాలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నా వరి కొయ్యలను రైతులు కాలుస్తూ ప్రమాదాలు కారణమవుతున్నారు.

►ALSO READ | గండిపేట ఫేక్ జీవో కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు 14 రోజుల రిమాండ్…

జగిత్యాల జిల్లాలో రైతులు పంట అవశేషాలను, వరి కొయ్యలను కాల్చవద్దని, అలా చేస్తేవారికి జరిమానా విధిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. వరి కొయ్యల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమిలోని సేంద్రియ కార్బన్, వానపాములు నశించి భూసారం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా మంటలు అదుపు తప్పి సమీపంలోని ఆయిల్ పామ్, మామిడి తోటలకు వ్యాపించి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట అవశేషాలను తగలబెడితే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.