Reading Time: < 1 minute
Peddi Movie New Trimmed Version In Theaters From Saturday Evening Shows

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్నప్పటికీ.. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమె లవ్ ట్రాక్‌పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వ్యక్తమవుతోంది. నెటిజన్లు, సినీ క్రిటిక్స్ నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘పెద్ది’ చిత్రంలో వివాదాస్పదంగా మారిన జాన్వీ కపూర్ సీన్లపై ఆయన వెనక్కి తగ్గారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను థియేటర్ల నుండి తొలగిస్తున్నట్లు (ట్రిమ్ చేస్తున్నట్లు) దర్శకుడు బుచ్చిబాబు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేశారు.

సినిమా అనేది కేవలం ప్రేక్షకులను అలరించడానికే గానీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, ఎవరి గౌరవానికి భంగం కలిగించడానికి కాదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఆడియన్స్ నుంచి వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను ఒక దర్శకుడిగా తాను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. సినిమాలో జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్ ఎవరినైనా బాధించి ఉంటే.. ప్రేక్షకుల సెంటిమెంట్లను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆయన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు.

మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, వారి సెన్సిటివిటీస్‌కు తాము బాధ్యత వహిస్తామని.. భవిష్యత్తులో తీయబోయే చిత్రాల్లో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా, పద్ధతిగా చూపిస్తానని బుచ్చిబాబు ప్రామిస్ చేశారు. ఈ మేరకు థియేటర్లలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను మార్చబోతున్నట్లు వెల్లడించారు. ఈరోజు (శనివారం) సాయంత్రం షోల నుంచే ఈ ట్రిమ్ చేసిన సరికొత్త వెర్షన్ ప్రేక్షకులకు థియేటర్లలో అందుబాటులోకి రానుంది. తప్పును ఎత్తిచూపినప్పుడు ఈగోలకు పోకుండా, ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే సీన్లను లేపేయాలని బుచ్చిబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.