Reading Time: < 1 minute
Tmc Mps Rebel Camp Mamata Banerjee Crisis Deepens

TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మమతా బెనర్జీపై అంతా తిరుగుబాటు చేస్తున్నారు. ఆమె మాట ఎవరూ వినే పరిస్థితిలో లేరు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని సస్పెండ్ అయిన రీటబ్రత బెనర్జీకి మద్దతుగా ఎమ్మెల్యేలు నిలిచారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల ఉంటే, 60 మంది రీటబ్రతకు జై కొట్టారు. దీంతో మమత నియమించిన ప్రతిపక్ష నేత శోవన్‌దేబ్ చటోపాధ్యాయను కాదని, రీటబ్రతను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. మమతాకు ఎంతో నమ్మకమైన ముస్లిం ఎమ్మెల్యేలు కూడా రెబల్ వర్గంతో చేతులు కలిపారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎంపీల్లో కూడా చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. 23 మంది ఎంపీలు రీటబ్రత నేతృత్వంలోని రెబల్ వర్గంతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీలు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మరికొన్ని ఊహాగానాల ప్రకారం, కొంత మంది ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీకి 29 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు, ఒక ప్రత్యేక వర్గంగా వీరిని గుర్తించాలంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కనీసం 22 మంది ఎంపీలు అవసరం. రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. తొమ్మిది మంది ఎంపీలు అవసరం.

ఎమ్మెల్యేల పరిస్థితి ఎంపీలకు కూడా రావొచ్చని సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ బహిరంగంగానే అన్నారు. ఇంతక తక్కువ సమయంలో 60 మంది పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. వరసగా జరుగుతున్న పరిణామాలు మమతా బెనర్జీపై నమ్మకం పోతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి.