Reading Time: 2 minutes
Hero Launches Indias First Flex Fuel Motorcycles Splendor Plus And Hf Deluxe Unveiled

ఓ వైపు ఇంధన సంక్షోభం, మరోవైపు పెట్రోల్ ధరల పెరుగుదల వేళ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇంధన ధరలకు చెక్ పెడుతూ దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులను విడుదల చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్, హెచ్‌ఎఫ్ డీలక్స్ అనే రెండు ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్డ్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇతర మోటార్‌సైకిళ్ల మాదిరిగానే, ఈ రెండు బైక్‌లు కూడా 85 శాతం ఇథనాల్‌తో నడుస్తాయి. సాధారణంగా ఫ్లెక్స్-ఫ్యూయల్‌లో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుందని గమనించాలి.

ధరలు ఎంత?

హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్ ధర రూ.72,792 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా, ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ప్లెండర్ ప్లస్ ధర రూ.82,710 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు జూలై 2026లో ఢిల్లీ, మహారాష్ట్రలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రారంభమవుతాయని, ఆ వెంటనే దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

వినియోగదారులకు నమ్మకమైన పనితీరు

“విశ్వసనీయమైన పనితీరు లేదా సరసమైన యాజమాన్య సౌలభ్యం విషయంలో రాజీ పడకుండా, ఈ కొత్త మోడళ్లు వినియోగదారులకు అత్యంత ఆచరణాత్మకమైన, సౌకర్యవంతమైన రవాణా పరిష్కారాన్ని అందిస్తాయి,” అని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారీ ప్రయాణంలో కార్బన్ ఉద్గారాలను, పర్యావరణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా, 2030 నాటికి కార్బన్ తీవ్రతను 45 శాతం తగ్గించాలన్న భారతదేశ జాతీయ లక్ష్యానికి ఈ మోటార్‌సైకిళ్లు మద్దతు ఇస్తాయని పేర్కొంది.

నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో విడుదల 

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో హీరో రెండు మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “ప్రత్యామ్నాయ ఇంధనాలు, స్వచ్ఛమైన ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీస్ ను అవలంబించడంలో భారతదేశం వేగంగా పురోగమిస్తోంది” అని అన్నారు.

ప్రస్తుతం, 20% కల్తీ చేసిన పెట్రోల్ మాత్రమే అందుబాటులో

పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచాలని ప్రభుత్వం కూడా యోచిస్తున్న విషయం గమనార్హం. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. దేశంలో పనిచేస్తున్న అనేక ఆటో కంపెనీలు, E20 పెట్రోల్‌కు (20 శాతం ఇథనాల్ ఉన్న పెట్రోల్) సపోర్ట్ చేసే ఇంజన్లతో వాహనాలను విక్రయిస్తున్నాయి.