Reading Time: 2 minutes
Trump Mojtaba Khamenei Meeting Iran Us Relations Peace Talks

ఇరాన్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని కలిసే అవకాశం ఉందని.. రెండు దేశాల మధ్య ప్రస్తుతం పరిస్థితులు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొనసాగుతున్న ఉద్రిక్తతలు, శాంతి చర్చల్లో జాప్యం ఉన్నప్పటికీ ఇరాన్‌తో తమ సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని తెలిపారు.

‘పాడ్ ఫోర్స్ వన్’ (Pod Force One) పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ నిర్ణయాల ప్రక్రియలో మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఆ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ సహా పాలక కుటుంబానికి చెందిన పలువురు మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితుల మధ్య కూడా మొజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ వ్యవస్థలో ప్రభావవంతమైన వ్యక్తిగానే కొనసాగుతున్నారని ట్రంప్ తెలిపారు. “అతను పూర్తిగా వ్యవహారాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఇరాన్‌లో అతనికి చాలా గౌరవం ఉంది” అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌తో కమ్యూనికేషన్ ప్రస్తుతం కొంత క్లిష్టంగా మారిందని తెలిపారు. ఖమేనీ బహిరంగ జీవితానికి దూరంగా ఉండటంతో సంప్రదింపులు మధ్యవర్తుల ద్వారా సాగుతున్నాయని చెప్పారు. “నేను ఇప్పటివరకు ఆయనను కలిసే అవకాశం దొరకలేదు. కానీ భవిష్యత్తులో కలిసే అవకాశముంది. పరిస్థితులు ఎలా మారతాయన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇరాన్ నాయకుడిని వ్యక్తిగతంగా కలిసేందుకు సిద్ధమేనా? అనే ప్రశ్నకు ట్రంప్ సానుకూలంగా స్పందించారు. “అవును.. నేను ఆయనను కలవాలనుకుంటున్నాను. అందరినీ కలవడానికి నేను సిద్ధంగానే ఉంటాను. ఏదో ఒక దశలో మేమిద్దరం కలుసుకునే అవకాశం ఉంది” అని తెలిపారు.

ఇది ట్రంప్ గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఉండటం గమనార్హం. గతంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వ సామర్థ్యంపై ట్రంప్ విమర్శలు చేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం ఆయనతో నేరుగా చర్చలకు సిద్ధమని, ముఖాముఖి సమావేశం కూడా జరగవచ్చని పేర్కొనడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కొత్త దౌత్య ప్రయత్నాలకు సంకేతంగా భావించవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, పశ్చిమాసియా స్థిరత్వం వంటి అంశాలపై భవిష్యత్తులో మరిన్ని చర్చలకు మార్గం సుగమం కావచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.