Reading Time: < 1 minute

శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. పేషెంట్స్ను మరో ఆసుపత్రికి తరలింపు

Caption of Image.

శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది.  భారీగా మంటలు ఎగసి పడటంతో హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. 2026 జూన్ 02న ఎమర్జెన్సీ వార్డులో  రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ వద్ద షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో హాస్పిటల్ అంతా కలకలం రేగింది. 

పొగలు వేగంగా వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన సిబ్బంది ఏసీ గదుల అద్దాలను పగులగొట్టి పొగ బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత రోగులను సురక్షితంగా తొండుపల్లిలోని లిమ్స్ ఆస్పత్రి మరో బ్రాంచ్‌కు తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ స్టేషన్లకు చెందిన ఫైర్ ఇంజన్లతో ఘటన స్థలానికి చేరుకున్నారు.  అప్పటికే మంటలు లేకపోవడంతో గదుల్లోని పొగను బయటకు పంపించే చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడంతో వైద్యులు, రోగులు, వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పరిస్థితిని సమీక్షించారు.ఆస్పత్రిలో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.