Reading Time: < 1 minute

చమురు, గ్యాస్ సరఫరాకు ఇక నో బ్రేక్స్..హార్మూజ్ సందిగ్ధత వేళ కేంద్రం చర్యలు

Caption of Image.
  • భారత్, ఒమన్ సీఈపీఏ ఒప్పందం అమలులోకి
  • హార్మూజ్ సందిగ్ధత వేళ  కేంద్రం చర్యలు
  •  

న్యూఢిల్లీ: హార్మూజ్ సందిగ్ధత వేళ గల్ఫ్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా ఒమన్‌‌‌‌‌‌‌‌తో భారత్ కుదుర్చుకున్న కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్(సీఈపీఏ) సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇకపై ఒమన్‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన ఓడరేవుల ద్వారా భారతదేశానికి చమురు, గ్యాస్ సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా అందనుంది. అలాగే, భారత్ నుంచి ఒమన్‌‌‌‌‌‌‌‌కు ఎగుమతి అయ్యే రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, పాదరక్షలు, ఫార్మాస్యూటికల్స్, బియ్యం వంటి దాదాపు 99 శాతం వస్తువులపై ఒమన్ ప్రభుత్వం విధించే సుంకాలు కూడా పూర్తిగా రద్దయిపోతాయి. దీనివల్ల ఒమన్ మార్కెట్లో భారతీయ వస్తువుల వ్యాపారం బాగా పుంజుకోనుంది. 

అదే టైంలో భారత్ కూడా ఒమన్ నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), ఎరువులపై పన్నులను భారీగా తగ్గించింది. ఈ ఒప్పందం మన దేశంలోని రైతులు, మహిళలు, చేతివృత్తులవారు, చిన్న పరిశ్రమల ఆర్థిక శ్రేయస్సుకు ఎంతో సహాయపడుతుందని, కొత్త ఉద్యోగాల కల్పనను వేగవంతం చేస్తూ దేశ ఆర్థిక రంగానికి కొత్త ఊపునిస్తుందని కేంద్రం భావిస్తున్నది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలకు ప్రమాదం నెలకొంది.

 ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర చమురు వ్యాపారంలో 25 శాతం హార్మూజ్ ద్వారానే సాగుతుంది. అయితే, ప్రస్తుతం ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు, అమెరికా చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం వల్ల సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల నుంచి మన దేశానికి వచ్చే చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడి, ధరలు పెరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలతో వ్యాపారానికి ప్రత్యామ్నాయంగా భారత్ ఒమన్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. గతేడాది డిసెంబరులో ప్రధాని మోదీ మస్కట్‌‌‌‌‌‌‌‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఇరు దేశాల ప్రతినిధులు జూన్ 1 నుంచి అమలు అయ్యేలా  సీఈపీఏ డీల్ పై సంతకాలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.