Reading Time: < 1 minute
Farmers Get Relief As Andhra Pradesh Releases Godavari Delta Irrigation Water For Kharif 2026

తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి డెల్టా రైతులకు శుభవార్త అందింది. ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని గోదావరి డెల్టా పరిధిలోని ప్రధాన కాలువలకు సాగునీటిని అధికారులు విడుదల చేశారు. ప్రతి ఏడాది నిర్ణీత తేదీతో పోలిస్తే.. ఈసారి ఒక రోజు ముందుగానే సాగునీటిని విడుదల చేయడం విశేషం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ధవలేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కాలువల్లోకి నీటిని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహించిన అనంతరం కాలువ గేట్లను ఎత్తి సాగునీటిని విడుదల చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. గోదావరి డెల్టా పరిధిలోని సుమారు 10 లక్షల 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని రైతులు ఈ నీటి విడుదలతో ప్రయోజనం పొందనున్నారు.

సాగునీరు ముందుగానే విడుదల కావడంతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ‘రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. గోదావరి డెల్టా పరిధిలోని ప్రతి ఎకరాకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.