Reading Time: 2 minutes
Bengaluru Traffic Jam Governor Convoy Man Protest Pregnant Wife

Bengaluru Traffic: వీఐపీ భద్రత పేరుతో సామాన్య ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులపై కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా పోలీసులు పాత విమానాశ్రయం (ఓల్డ్ ఎయిర్‌పోర్ట్) రోడ్డుపై సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో భారీ గందరగోళం చెలరేగింది. ఈ ఊపిరాడని ట్రాఫిక్ జామ్‌లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్న ఓ గర్భిణీ స్త్రీ, ఆమె భర్త చిక్కుకుపోయారు. పోలీసుల తీరుతో సహనం కోల్పోయిన ఆమె భర్త.. నిరసనగా నడిరోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలేం జరిగిందంటే..
పాత విమానాశ్రయ రహదారిలో ప్రస్తుతం అండర్‌పాస్ నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఈ రోడ్డు ఇప్పటికే ఇరుకుగా మారి, వాహనదారులు రోజూ నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ కాన్వాయ్ ఆ దారి గుండా వెళ్తుండటంతో సమస్య మరింత జటిలమైంది. మధ్యాహ్నం సుమారు 12:13 గంటల ప్రాంతంలో @Prajvalprince అనే ఖాతా నుంచి ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ అయింది. “ఈరోజు, గవర్నర్ గారి రాకపోకల కారణంగా, సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది” అంటూ సదరు నెటిజన్ ఆ వీడియోను పంచుకున్నారు.

‘నా భార్య గర్భవతి.. గవర్నర్ ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు!’
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక వ్యక్తి ఇస్రో (ISRO) జంక్షన్ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు మధ్యలోనే కూర్చుని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. గవర్నర్ ఇంకా హెచ్‌ఏఎల్ (HAL) విమానాశ్రయం నుంచి బయలుదేరక ముందే పోలీసులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేశారని ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్య గర్భవతి అని, నొప్పులతో కారులోనే తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకపోవడంతో, భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వేరే దారి లేక తను రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని వాపోయాడు. ఆ వ్యక్తి రోడ్డు మధ్యలో ధర్నాకు కూర్చోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఇరకాటంలో పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుండటం గమనించిన ట్రాఫిక్ సిబ్బంది.. వెంటనే స్థానిక ‘హోయసల’ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్) పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తికి నచ్చజెప్పి, బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఆ తర్వాతే గవర్నర్ కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు కదిలింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, సామాన్య ప్రజలు వీఐపీ కల్చర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. “ప్రముఖుల భద్రత పేరుతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను, గర్భిణీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమర్థనీయం?” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అత్యవసర వాహనాలకు, అంబులెన్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా వీఐపీ కాన్వాయ్‌ల కోసం గంటల తరబడి రోడ్లు బంద్ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.