Reading Time: < 1 minute
Telangana Govt Issues New Rule Vehicle Owners Must Update Details For Traffic Challan Alerts

Telangana Traffic Challans: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరేలా రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై చలాన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకోడానికి వాహనదారులు తమ వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని స్పష్టం చేసింది. రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. వాహనదారులు ఈ గడువులోగా తమ వివరాలను vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాఫిక్ చలాన్లు, ఇతర రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు మరియు ఈ-మెయిల్ ద్వారా నేరుగా వాహన యజమానులకు పంపించనున్నారు. దీంతో చలాన్ల విషయంలో పారదర్శకత పెరగడమే కాకుండా, పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపిన సమాచారం సంబంధిత వాహన యజమానికి చేరినట్లుగానే ప్రభుత్వం పరిగణించనుంది. ఈ నేపథ్యంలో “మాకు చలాన్ సమాచారం రాలేదు”, “మెసేజ్ అందలేదు”, “విషయం తెలియదు” వంటి కారణాలను ఇకపై అధికారులు అంగీకరించబోరని స్పష్టం చేశారు.

వాహనదారులు తమ వివరాలను సకాలంలో నవీకరించుకోవడం ద్వారా చలాన్ల సమాచారం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చెల్లింపులను కూడా సకాలంలో పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. అందువల్ల అన్ని వాహన యజమానులు నిర్దేశిత గడువులోగా వాహన్ పోర్టల్‌లో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ సూచించింది. ఈ కొత్త విధానం ద్వారా చలాన్ల వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. దీంతో భవిష్యత్తులో చలాన్లకు సంబంధించిన వివాదాలు, అపోహలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.