
అన్నామలై.. ఈ మాట వింటే బీజేపీ కార్యకర్తలకు పూనకాలు వస్తాయి. నిన్నా మొన్నటి వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ పగ్గాలు చూసిన అన్నామలై.. గత ఎన్నికల సమయంలో పార్టీకి దూరంగా ఉన్నారు. తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచి విజయ్ సీఎం అయిన తర్వాత.. అస్సలు నోరెత్తటం లేదు.. బయట కనిపించటం లేదు అన్నామలై. ఈ క్రమంలోనే ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్లు తమిళనాడు రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేనా.. కోయంబత్తూరులో అన్నామలై కొత్త పార్టీ అంటూ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కొత్త పార్టీగా అన్నామలై అడుగులు వేస్తున్నారని.. కాక్రోచ్ తరహాలో ఉద్యమం తీసుకొచ్చి.. కొత్త పార్టీకి ఊపిరిపోయాలని చూస్తున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది.
గత కొంతకాలంగా బీజేపీకి అంటిముట్టనట్లుగా ఉంటున్న తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా..? టీవీకే చీఫ్, సీఎం విజయ్ మాదిరిగానే కొత్త పార్టీ ఏర్పాటు చేసి తమిళనాడులో రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నారా..? అంటే తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న అన్నామలై త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ కోయంబత్తూర్‌లో పోస్టర్లు వెలవడం తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
నిర్భయమైన మనస్సుకు పరిమితులు ఉండవనే నినాదంతో అన్నామలై ఫొటోతో కూడిన పోస్టర్లు కోయంబత్తూర్ అంతటా వెలిశాయి. అన్నామలై అభిమానుల సంక్షేమ సంస్థ అయిన అన్నామలై అన్బు కూట్టం ఈ పోస్టర్లు ఏర్పాటు చేసింది. పోస్టర్లతోనే ఆగకుండా కొత్త సభ్యులు, కార్యవర్గ సభ్యులను చేర్చుకుంటున్నారు అతని మద్దతుదారులు.
అన్నామలై కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారా అనే ఊహాగానాలకు ఈ పోస్టర్లు మరింత ఆజ్యం పోశాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఓ ట్వీట్ కూడా అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. తమిళనాడు మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి అని కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్నామలై ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.
బీజేపీకి దూరంగా అన్నామలై
ఒకప్పుడు తమిళనాడు బీజేపీకి ముఖ చిత్రంగా ఉన్న అన్నామలై అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. కీలకమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరు కావడం లేదు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు కూడా అతడు నిరాకరించాడు. అంతేకాకుండా బీజేపీ త్రిభాషా సిద్ధాంతాన్ని కూడా అన్నామలై బహిరంగంగా వ్యతిరేకించారు.