Reading Time: 2 minutes

ఆంధ్రప్రదేశ్ పల్లె సీమల రూపురేఖలు మారబోతున్నాయి. అగ్ర నగరాలకే పరిమితమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ ఇకపై మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ చేరువ కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందంతో ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ కల సాకారం కాబోతోంది. సుమారు రూ. 2,432 కోట్ల భారీ పెట్టుబడితో, 5 లక్షల గ్రామీణ ఇళ్లకు భారత్‌నెట్ ద్వారా కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇది కేవలం వైర్ల అనుసంధానం కాదు, పల్లెల ప్రగతికి వేసే బంగారు బాట. ఆ వివరాలు ఇలా వున్నాయి..

ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే విలాసం.. కానీ నేడు అది ప్రతి సామాన్యుడి అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘డిజిటల్ భారత్ నిధి’ మధ్య కీలక ఎంఓసీ కుదిరింది.

Step Toward Digital AP: BharatNet to Connect Every Village
Step Toward Digital AP: BharatNet to Connect Every Village

పల్లెల్లో డిజిటల్ తరంగాలు: ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 13,426 గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ ఫైబర్ నెట్‌వర్క్ విస్తరించనుంది. దీని కోసం APBIL (ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) అనే ప్రత్యేక విభాగం రంగంలోకి దిగింది. మొదటి దశలో 1,692 పంచాయతీల నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, రెండో దశలో మిగిలిన 11,254 గ్రామాలకు పూర్తిస్థాయి కనెక్టివిటీని అందిస్తారు. కొత్తగా ఏర్పాటైన 480 గ్రామ పంచాయతీలు కూడా ఈ డిజిటల్ వెలుగుల్లో పాలుపంచుకోనున్నాయి.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్: పల్లెటూరి విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి పాఠాలను వారి ఇంట్లోనే వినవచ్చు. టెలిమెడిసిన్, అత్యవసర సమయాల్లో పట్నం డాక్టర్లతో వీడియో కాల్ ద్వారా సలహాలు పొందవచ్చు. ఈ-గవర్నెన్స్ అంటే  ప్రభుత్వ సేవలు, సర్టిఫికెట్ల కోసం మండల ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, గ్రామ సచివాలయాల్లోనే పనులు పూర్తవుతాయి. డిజిటల్ చెల్లింపులు మారుమూల కిరాణా కొట్టులో కూడా నిరంతరాయంగా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

కేంద్రం మంజూరు చేసిన రూ. 2,432 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాల సహకారం తోడైతే ఏపీలోని ప్రతి పల్లె ఒక గ్లోబల్ విలేజ్‌గా అవతరించడం ఖాయం. అడ్డంకులను అధిగమించి నెట్‌వర్క్ అందని ప్రతి గడపకూ ‘అమెండెడ్ భారత్ నెట్’ చేరబోతోంది.

The post డిజిటల్ ఏపీ దిశగా అడుగు: భారత్‌నెట్‌తో ప్రతి గ్రామానికి కనెక్టివిటీ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.