
తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆదివారం బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించి, ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మార్చి నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి బాసర ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 225 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో, ఆ పనులను వేగవంతం చేయడంపై ఆయన అధికారులతో చర్చించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆర్ అండ్ బి ఈఎన్‌సీ మోహన్ నాయక్ లతో కలిసి ఆయన ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ కు ఇప్పటివరకు సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను వివరించారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ రాబోయే 100 ఏళ్ల వరకు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఈ ప్లాన్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
Basara Temple Development
ఈ ప్రాజెక్టులో భాగంగా గర్భాలయం, అనివెట్టి మండపం, మరియు కాళికా అమ్మవారి ఆలయాల విస్తరణ పనులతో పాటు, ఆలయానికి తూర్పు వైపున గంభీరమైన తోరణాలు , నాలుగు దిక్కులా సుందరమైన రహదారులను నిర్మిస్తారు. భక్తుల వసతి కోసం అత్యాధునిక కాటేజీల నిర్మాణం కూడా ఇందులో భాగమే. ముఖ్యంగా, విద్యాప్రదాయిని అయిన అమ్మవారి దర్శనానికి వచ్చే విద్యార్థుల కోసం ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించి, అక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు.
Basara Temple Development
త్వరలోనే హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఆలయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బాసర ఆలయ అధికారులు బాలాలయాన్ని రూ 150 టికెట్టు అక్షర శ్రీకారం మండపంలో ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.