Reading Time: < 1 minute
Cm Revanth Reddy Mega Growth Corridor Review Telangana Development Plan

CM Revanth Reddy: ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఖర్చు తగ్గించే దిశగా ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచాలని, ప్రభుత్వ అవసరాల కోసం లీజ్‌కు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ ప్రభావం తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్స్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్కు అవసరమైన నీటి వనరులపై కూడా ముందస్తు ప్రణాళిక ఉండాలని సీఎం పేర్కొన్నారు. అలాగే సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, సంస్థ సీఎస్‌ఆర్ నిధులను స్థానిక ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలని సూచించారు. నల్గొండ – యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసర సరస్వతి ఆలయం, కడెం ప్రాజెక్ట్‌లను అనుసంధానిస్తూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ ఒక కారిడార్, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను కలుపుతూ మరో కారిడార్ అభివృద్ధి చేయాలని సూచించారు. రేడియల్ రోడ్లు పెద్ద మున్సిపాలిటీలకు సమీపంగా ఉండేలా డిజైన్ చేయాలని, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. వరంగల్–కరీంనగర్–ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి అత్యంత కీలకమని, ఎయిర్‌పోర్టుల రాకతో ఈ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని తెలిపారు. ఇక ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.